Monday, May 25, 2009

బరువు - బాధ్యత

అదొక వర్షం కురవని రాత్రి....టైం పదకొండో,పన్నెండో, ఒకటో, రెండో అయ్యింది. దూరంగా నక్కల ఊళలు ఏవీ వినపడక పోవటం తో నేను పడుకుని నిద్రపొయ్యాను....నా జీవితంలో మరచిపోలేని ఈ సంఘటన జరిగి ఇప్పటికి సరిగ్గా కొన్ని సంవత్సరాలా, కొన్ని నెలలయ్యింది.... ఒక రోజు....నేను ఆఫీసుకు బండిలో బయలుదేరుతుంటే రోడ్డు మీద స్కూలు బాగు తగిలించుకుని ఒక పిల్లవాడు లిఫ్ట్ అడుగుతున్నాడు...గోధుమ రంగు నిక్కరు, తెల్ల చొక్కా వేసుకునున్నాడు. చిన్మయా విద్యాలయా యూనిఫార్మ్...బండి ఆపాను..."ఎక్కడికి?" అడిగాను...."మీకు చిన్మయా స్కూల్ తెలుసా?" అడిగాడు...."ఆ తెలుసు" అన్నాను....."దాని దరిదాపుల్లో కాకుండా ఎక్కడైనా దూరంగా దించెయ్యండి" అన్నాడు..బెత్తం భయంతో బడి ఎగ్గొట్టి బయట తిరిగిన రోజుల్లో నాకు కూడా ఇలాంటి సహాయం బోలెడు మంది చేసారు..వీడిని కూడా నా మార్గంలొ నడిపిద్దామని బండి ఎక్కించుకున్నాను....పిల్లవాడు కదా అని బండి 40 లో పోనిస్తున్నాను..."బండి భలే తోలుతున్నారు..మీ పేరేంటి లావాటి అంకుల్?" అన్నాడు."లావాటి అంకులా???" వాడన్న మాటకి ఎవడో నా గుండెల్లో గాజు పెంకులు గుచ్చినంత బాధేసింది....నాకు కష్టం కలిగింది వాడు నన్ను 'అంకుల్ ' అన్నందుకు కాదు...ఆ పిలుపు నాకు అలవాటైపొయ్యింది (మన భారత దేశం లో ఇంటర్మీడియెట్ అయిపొతే మనకు వయసైపొయినట్టే....మన ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి పదో క్లాసు గాడిదలు కూడా 'అంకుల్ ' అని పిలుస్తారు)....వాడు నన్ను 'లావాటి ' అన్నాడే..అక్కడే కాలింది..ఇంతటి మాటన్నందుకు ఆ పిల్ల రాక్షసుడికి కోలుకోలేని శిక్ష వెయ్యాలని నిర్ణయించుకున్నాను....బండిని నేరుగా చిన్మయా విద్యాలయా ప్రిన్సిపల్ రూము ముందు ఆపాను...వాడన్న మాటలకు బాధ తట్టుకోలేక ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాను....మా అన్నయ్యకు ఫోను చేసి "ఏరా...నేను లావుగా ఉన్నానా" అని నిలదీసాను....దానికి మా అన్నయ్య "ఈ మధ్య కాస్త లావయ్యావు కద రా..ఇప్పుడెందుకొచ్చింది ఆ అనుమానం?" అన్నాడు..."మరి ఇన్నాళ్ళూ చెప్పలేదే?" అడిగాను..."నేను చెప్పేదేంట్రా...నీ దగ్గర అద్దం లేదా?" అన్నాడు..."అది కూడా ఎప్పుడూ చెప్పలేదు రా......ఛ...సరే..నేను ఆత్మహత్య చేసుకోవాటానికి వెళ్తున్నాను..తరువాత ఫోన్ చేస్తా" అని పెట్టెయ్యబోయాను...దానికి మా వాడు "ఈ విషయానికి అంత బాధెందుకు రా...వెళ్ళి ఏదైనా మంచి జిం లో చేరు...వ్యాయామం చెయ్యి..మళ్ళీ మామూలుగా తయారౌతావు. ఈ సారైనా క్రమం తప్పకుండా రోజూ చెయ్యి...లేక పోతే జనాలు నిన్ను'బండంకుల్' అనో 'లావాటి అంకుల్ 'అనో అని పిలుస్తారు జాగ్రత్త " అని పెట్టేసాడు..నేను గతంలో కండలు పెంచటానికి చాలా సార్లు జిం లో చేరాను....హైవేల మీద స్పీడు బ్రేకర్ల లాగా ఇంతింత బొజ్జలేసుకున్న వాళ్ళు చాలామంది వస్తారు అక్కడకు....గోడలకు సిల్వెస్టర్ స్టాలన్, సంజై దత్ లాంటి హీరోల ఫొటొలు చాలా అతికించుంటాయి.....వీళ్ళతో పాటు జిం లో ఒక పెద్ద విలన్ కూడా ఉంటాడు....వాడి పేరు 'ట్రైనర్ '...బయట గ్రౌండులో పరిగెట్టిస్తే అట్నుంచి అటే ఇంటికి ఎక్కడ పారిపోతామో అని...జిం లో ట్రెడ్ మిల్ మీద పరిగెట్టిస్తాడు. నా వల్ల కాదు..ప్రాణభిక్ష పెట్టమని ఎంత అడుక్కున్నా చలించడు...నెలనెలా డబ్బు కట్టమంటే మొదటి నెల తరువాత ఎవ్వడూ కట్టడని.. మూడు నెలలకు కలిపి కట్టించుకుంటారు డబ్బులు. క్రితం సారి జిం లో చేరినప్పుడు నేను కూడా మూడు నెలల డబ్బు కట్టాను..కానీ వెళ్ళింది ఒకటిన్నర రోజులు . నేను చేరిన రెండవ రోజే ట్రైనర్ శెలవు పెట్టాడు...వాడి అసిస్టెంటు నాతో మిస్టర్ యూనివర్సు పోటీలకు తయారయ్యే వాళ్ళు చేసే ఎక్సర్సైసులన్నీ చేయించాడు...ఒక్కొక్కటీ మూడు సార్లు....."ఒళ్ళు హూనం" అంటారుగా...దానిని 10 తో గుణిస్తే ఎమంటారో అది అయ్యింది నాకు. ఆ రోజు రాత్రి నిద్ర పొయ్యి లేచాను...పైకి లేద్దామని చూస్తే నా వల్ల కాలేదు...చేతులకు, కాళ్ళకు బియ్యం బస్తాలు కట్టేసినట్టుంది...అటూ, ఇటూ ఒక్క అంగుళం కూడా కదలలేని పరిస్థితి.....అంతే..ఆ తరువాత నేను ఇంకో సారి జిం లో చేరలేదు... ఏమీ కష్టపడకుండా బరువు తగ్గే పధ్ధతి ఏదైన ఉందా అని నేను పరిశోధన చేస్తున్న సమయంలో దేవత లాగ కనిపించింది నా కొలీగ్ హేమలత...నా చెవిలో 'డైటింగ్, డైటింగ్, డైటింగ్' అని మంత్రోఛ్ఛారణ చేసింది..అంతే..ఒక వారం రోజుల పాటూ కడుపు ఎండగట్టాను...మూడు తలతిరగడాలు, ముప్పై మూడూ జ్వరాలతో డైటింగ్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న సమయంలో...మా ఇంటి దగ్గర మెరపకాయ బజ్జీలవాడు "End of season sale" పెట్టాడు....పది రూపాయలకు బజ్జీలు కొంటే రెండు రూపాయల బోండాలు ఫ్రీ...తేరగా బోండాలువస్తుంటే వదులుకునేంత రాతి హృదయం కాదు నాది. కట్ చేస్తే.. నడుము చుట్టూ ఒక అంగుళం పెరిగింది... ఆఫీసులో 7 వ అంతస్థు లో ఉంటుంది నా సీటు.....మెట్లెక్కితే మంచి ఎక్సరసైసు అని లిఫ్టు ఎంత ఆహ్వానిస్తున్నా రోజూ మెట్లెక్కే వెళ్ళేవాడిని. కాని ఒక రోజు మెట్లెక్కబోతుంటే....అక్కడ నుంచున్న సెక్యూరిటీ వాడు ఆపి "పొద్దున్నుండి మెట్లు పని చెయ్యట్లేదు సార్...ఇవ్వాళ లిఫ్ట్ లో వెళ్ళండి" అన్నాడు. అంతే...నడుము చుట్టూ ఇంకో ఇంచు.. ఇలా నాకు తెలియకుండా కొంచెం కొంచెంగా బరువు పెరుగుతూ పోతున్న సమయంలో న్యూస్ పేపర్ లో ఒక చిన్న ప్రకటన చూసాను..."అధిక బరువు మీ సమస్యా? అయితే ఈ నంబర్ కు ఫోను చెయ్యండి: 9845749659 - దినకర్"...అని ఉంది. నేను ఆ దినకర్ అనే మనిషి కి ఫోను చెయ్యంగానే 'నేనే మీ ఇంటికి వస్తాను సార్ ' అని అడ్రస్సు తీసుకున్నాడు..ఆ దేవదూత దినకర్ కోసం ఎదురుచూస్తూ గడియారం చూసాను..టైం 7:00 అయ్యింది. మంచినీళ్ళు తాగుదామని మంచం మీద నుంచి లేవబొయ్యాను...మెడ పట్టేసినట్టయ్యింది....అమ్మా...అస్సలు ఈ మెడ నొప్పంత దారుణంగా మనిషిని పీడించేది ఒకే ఒకటి - మెడ నొప్పి! దీనికి కారణమేంటో నాకు అర్థమయ్యింది...అందుకే ఆ రోజు నుంచి రాత్రి యేడింటికి నేను ఎప్పుడూ మంచినీళ్ళు తాగలేదు.7:15 కంతా దినకర్ మా ఇంటికి వచ్చాడు..చూడటానికి చాలా సన్నగా ఉన్నాడు..'ఆహా సరైన మనిషి చేతిలో పడ్డట్టున్నాను...నేను కూడ ఇంత సన్నగా అయిపోవచ్చూ అనుకుని.."రండి...ఏమి తీసుకుంటారు?" అని అడిగాను..."ఆల్రెడీ బయట మీ షూ పాలిష్ డబ్బా జేబులో వేసేసుకున్నాను..వేరే ఏమీ వద్దు " అన్నాడు...నేను నా సమస్య చెబుదామనుకునేలోపు మళ్ళీ తనే మాట్లాడుతూ " సార్...నేను చిన్నప్పటి నుండి చాలా సన్నగా ఉన్నాను...ఎంత ప్రయత్నించినా లావు కావట్లేదు..మీ లాంటి వాళ్ళను కలిస్తే కొవ్వు ఎలా పెంచుకోవాలో చెబుతారని ఆ ప్రకటన ఇచ్చాను...ఇప్పుడు చెప్పండి...మీ అధిక బరువు రహస్యమేంటి?" అన్నాడు....తినటానికి తిండి లేదని ఒకడేడుస్తుంటే మందులోకి సైడ్ డిష్ అడిగాడంట వెనకటికి ఒక దినకర్......నా కంట్లో నీళ్ళు చూసి వాడికి పరిస్థితి అర్థమయ్యి వెళ్ళిపొయ్యాడు. ఆ వెళ్ళేవాడు ఊరికే పోకుండా.. బరువు తగ్గటానికి నాకు జిం వాళ్ళు ఇచ్చిన పొడి,గూట్లో పెట్టున్నది, తస్కరించుకుని మరీ వెళ్ళాడు. తరువాత తెలిసింది నాకు....దానిని కంది పొడి లాంటిదే అనుకుని, నెయ్యి వేసుకుని అన్నంలోకి కలుపుకుని తిన్నాడంట...ఎలక లా ఉండేవాడు బొద్దింక లాగా తయారయ్యాడు......ఇలాంటి తరుణంలో నేను, నా అధిక బరువు కలిసి ఒక సారి TV చూస్తుండగా టెలీ షాపింగ్ నెట్వర్క్ వాళ్ళ అడ్వర్టైస్మెంటు ఒకటి వచ్చింది..'Fit, Fitter, Fittest' అనే పరికరం గురించిన ప్రకటన అది..ఆ అడ్వర్టైస్మెంటులో అమ్మాయిలు, అబ్బాయిలు ఆనందంగా నవ్వుతూ ఎక్సర్సైసులు చేస్తున్నారు...వాళ్ళందరిలోకీ ఎక్కువగా నవ్వుతున్నవాడు "మా ఈ 'Fit, Fitter, Fittest' తో వ్యాయామం చెయ్యండి...రోజుకు 10 నిముషాలు చాలు...మీ శరీరం లో ఉండే కొవ్వు అంతా కరిగి పోతుంది...కాళ్ళూ చేతులు బలంగా తయారౌతాయి...కండలు తిరుగుతాయి....పళ్ళు మిలమిలా మెరుస్తాయి..జుట్టు నిగనిగలాడుతుంది..చొక్కా తళతళ మెరిసిపోతుంది " అన్నాడు..ఇంతటి గొప్ప పరికరాన్ని పెట్టుకుని నేను అనవసరంగా కష్టపడుతున్నా...పైగా దీనితో బోలెడన్ని లాభాలు (పళ్ళు, జుట్టూ, చొక్కా)....వెంటనే ఆ పరికరం ఆర్డర్ చేసేసాను..1000 రూపాయలయ్యింది. దానిని ఇంటికి తెచ్చిన వాడు కూడా నవ్వుతూ ఇచ్చాడు...ఎంత మంచి మనుషులు వీళ్ళంతా.....ఆలస్యం చెయ్యకుండా 'Fit, Fitter, Fittest' కవర్ తీసేసి, దాని మీద కూర్చుని, TV లో చూపించినట్టుగా నవ్వుతూ ఎక్సర్సైసు చెయ్యటానికి ప్రయత్నించా...అది ఎటూ కదలటం లేదు...ఒక అర గంట పాటు దానిని అన్ని వైపుల నుంచి కదల్చటానికి ప్రయత్నించా...దానికున్న పిడికి తగులుకుని నా షర్టు చిరిగాక వదిలేసా...అప్పుడర్థమయ్యింది..ఆ అడ్వర్టైస్మెంటు వాళ్ళూ, ఆ డెలివరీకి వచ్చిన వాడు ఎందుకు నవ్వుతూ కనిపించారో....అంత డబ్బు పోసి దీనిని కొనే నాలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే ఇక నవ్వక ఏంచేస్తారు? చెయ్యగలిగింది ఏమీ లేక ఆ పరికరం పేరు కొంచంగా మార్చి ('i' లు ఉన్న చోటంతా 'a' లు చేర్చాను) లావు కావటానికి తపించిపోతున్న దినకర్ కు 5000 రూపాయలకు అమ్మేసాను...పోనీ ఏవైన పుస్తకాల్లో లావు తగ్గటానికి మార్గాలుంటాయేమోనని నాలుగైదు పుస్తకాలు కొని చదివా...మంచి 10, 15 కిటుకులిచ్చి, చివరకు "మీరు ఇవన్నీ క్రమశిక్షణ, పట్టుదల తో చేస్తే తప్పకుండా చక్కటి,నాజూకైన శరీరం మీ సొంతమవుతుంది " అని రాస్తారు....అసలు ఆ క్రమశిక్షణ, పట్టుదలే ఏడ్చుంటే ఇలాంటి పుస్తాకాలు ఎందుకు కొంటాను?? అవి లేని వాళ్ళకోసం ఏవన్నా చిట్కాలుంటాయనే కదా ఈ తనకలాట... కాస్త పెద్దవాళ్ళకెవరికైన నా బాధలు చెప్పుకుంటే "ఇప్పుడు ఉద్యోగాలలో పొద్దున్నుంచి కుర్చీలో కూర్చొనే ఉండాలి...అందుకే అలా లావుగా ఔతున్నారు " అంటారు...నాకర్థం కాదు,..ఇదివరకు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఆఫీసులో గంటకొకసారి కబడ్డీ ఆడేవాళ్ళా ఏంటీ??అయినా ఈ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేసాడనే చెప్పుకోవాలి..నాకు తెలిసిన కొంతమంది ఎంత తిన్నా, వ్యాయామం చెయ్యకపొయ్యినా లావు పెరగరు...మరి నేను ...గట్టిగా గాలి పీల్చినా రెండు కిలోలు బరువు పెరుగుతాను..ఇవ్వాళ తెల్లవారుజామున గేటు చప్పుడైతే ఎవరబ్బా అని కిటికీలోంచి చూసా...సుచరిత గారు...మా ఎదురింట్లోనే ఉంటుంది...చిన్నప్పటి నుంచి నన్ను 'తమ్ముడూ...తమ్ముడూ ' అని ఎంతో ప్రేమతో పలకరించేది ఎప్పుడూ....తలుపు తీసి "రండి ఆంటీ" అన్నాను. దానికి ఆవిడ "లావాటి అన్నయ్య గారూ....కొంచం పంచదార వుంటే ఇస్తారా...మీ బావగారికి జిం కు ఆలస్యమౌతొంది " అంది..ఈ సూటిపోటి మాటల బరువు నేను మొయ్యలేను..ఇంకో మూడు నెలల్లో నేను బరువు తగ్గుతాను.....ఒక వేళ తగ్గకపోతే....దానికి నైతిక బాధ్యత వహించి మన రాష్ట్రపతి రాజీనామా చెయ్యాలి!

No comments: